అయ్యలారా కేవలం వైజాగ్ గురించి మాత్రమే ఏడవకండి. మీ ప్రాంతాలగురించీ ఏడవండి

 పచ్చని పొలాలని చూసి ప్రకృతి అనీ

తవ్వబడుతున్న కొండలని చూసి విధ్వంసం అనీ అనుకోవడం మూర్ఖత్వం. రెండూ విధ్వంసాలే! ఒకటి విధ్వంసంలా అనిపిస్తుంది రెండోది అనిపించదు అంతే.
Facebok లో రిషికొండ తవ్వబడుతున్న ఒక పిక్చర్ share చేయబడుతుంది. అందరూ గుండెలు బాదేసుకుంటున్నారు వైజాగ్ నాశనం అయిపోతుంది అని. ఇక్కడే ఒక visual/ image యొక్క power మనకి అర్ధమవుతుంది. పచ్చని పొలాలన్నీ ఒకప్పుడు అడవులు. చెట్లు నరికి పొలాలుగా మార్చబడ్డాయి. పచ్చగా ఉన్నంత మాత్రాన అది deforestation కాకపోదు. కానీ అది మన మెదడు మీద భయానకమైన ప్రభావం చూపించదు అంతే తేడా!. కానీ కొండ తవ్వబడుతున్న దృశ్యం, అది కూడా proclainer లో తవ్వబడుతున్న దృశ్యం మనల్ని ఎక్కువ కలిచివేస్తుంది. బహుశా అదే తవ్వకాలు పంచెలు, చీరలు కట్టుకున్న కూలీలు చేస్తే దాని ప్రభావం మనమీద అంత తీవ్రంగా ఉండకపోవచ్చు. అందుకే అమరావతి లో జరిగిన ప్రకృతి విధ్వంసం మనకి విధ్వంసం లా అనిపించి ఉండకపోవచ్చు. మనకి పోస్టులు పెట్టడానికి, కవితలు రాయడానికి ప్రేరణ లభించి ఉండకపోవచ్చు.

1995 లో నేను వైజాగ్ లో eamcet కోచింగ్ కోసం ఒక సంవత్సరం ఉన్నాను. అప్పుడు ఆశీల్ మెట్ట flyover లేదు. NAD కొత్తరోడ్డు దగ్గర flyover లేదు. వైజాగ్ లో ఇంత ట్రాఫిక్ లేదు. వైజాజ్, భీమిలి మధ్య ఉన్న కొండలని ఎవరూ ఆక్రమించుకోలేదు. ఇప్పుడు వైజాగ్ చూస్తే గుండె చెరువైపోతుంది. కానీ ఇంత ట్రాఫిక్ పెరగడానికి, polution కి, కొండలు అక్రమించబడడానికి కారణం YSRCP కాదు. అయితే TdP అయిఉండొచ్చు. అప్పుడు మనకి అది ప్రకృతి విధ్వంసం లా అనిపించలేదు. ఎందుకంటే మనకి ఒక visual లేదు. అదికూడా proclainer తో కొండలు తవ్వబడుతున్న visual. అందుకే మనం కవితలు, పోస్టులు రాయలేదు.

"యుగయుగానికీ స్వభావం మారుతుంది
కనిపించని ప్రభావానికి లొంగుతుంది" అంటాడు తిలక్. మార్పు సహజం. కొండలు చదును చేయబడడం, పుంతలు రోడ్లుగా, రోడ్లు హైవే లు గా మారడం, పూరిళ్ల స్థానంలో పెంకుటిళ్లు, పెంకుటిళ్ల స్థానంలో అపార్టుమెంట్లు రావడం సహజం ఇది అభివృధ్ధా కాదా అన్నది చర్చిందగ్గ విషయమే కానీ చాలాసార్లు సమాజం ముందుకెళ్తున్నప్ప్పుడు, ప్రజల జీవనవిధానాన్ని technology లాంటి అనేక విషయాలు ప్రభావితం చేస్తున్నప్పుడు మారడం జియోగ్రఫీ సహజస్వభావం.

ఒకప్పుడు మా ఊర్లో సన్నని తారు రోడ్డు కి ఇరువైపులా నిద్రగన్నేరు చెట్లు, ఆ చెట్ల బొరియల్లో కిలకిలారావాలు చేస్తూ పచ్చని చిలుకలు, కొమ్మలకి వేలాడుతూ కొండముచ్చూలూ ఉండేవి. ఎర్రని పెంకుల ఇళ్లు, పేడతో అలకబడిన వాకిళ్ళూ ఉండేవి. ఈరోజు ఆ చెట్లు లేవు, చిలుకలు లేవు, కొండముచ్చూలూ లేవు. పెంకుటిళ్ల స్థానంలో డాబాలూ, అపర్ట్మెంటులూ వచ్చేసాయి. ఎవరు దీనికి కారణం? మా ఊరేమీ రాజధాని కాదే? మరెందుకీ విధ్వంసం అనిప్రశ్నిస్తే ఒకటే సమాధానం. అది మానవ స్వభావం!

"పూర్వం హైదరాబాద్ వాతావరణమే ఉజ్వలంగా ఉండేది. ఆ గాలిలోనే వింత పరిమళాలుండేవి. ఎండలో తీక్షణమైన మెరుపు.

అయినా ఆహ్లాదంగా ఉండేది. ఆంధ్రులు అక్కడ చేరి మురికి చేసిందాకా" అంటాడు చలం హైదరాబాద్ గురించి. ఈరోజు హైదరాబాద్ లోని అందమైన రాళ్లు ముక్కలు ముక్కలుగా విరగ కొట్టబడి గుట్టలుగా పేర్చబడ్డాయి. వాతావరణంలో ఒకప్పటి చల్లదనం లేదు. బన్ మస్కా స్థానంలో, ఖీమా రోటీ స్థానంలో ఇడ్లీలు పుణుకులు అమ్మబడుతున్నాయి. హైదరాబాద్ తన రూపురేఖలు కోల్పోయింది. ఎందుకు? ఎందుకీ విధ్వంసం? ఎందుకొచ్చారీ ఆంధ్రులు? అని అడిగితే "రాజధాని కాబట్టి వచ్చాం" అని సమాధానమిచ్చారు అసెంబ్లీలో వైస్సార్. అదీ విషయం. ప్రతీ రాష్ట్రానికి ఒక రాజధాని అవసరం అవుతుంది. సదుపాయాలు అవసరం అవుతాయి, కంపెనీలు వస్తాయి, ఉద్యోగావకాశాలు పెరుగుతాయి, వాటికోసం వచ్చే జనం పెరుగుతారు. వాళ్ళకి ఉండడానికి ఇళ్లు అవసరమవుతాయి. అందుకు స్థలాలు చదును చేయబడతాయి. చెట్లు కొట్టబడతాయి. కొండలు తవ్వబడతాయి. ఇది తప్పనిసరి. ఎందుకంటే అభివృద్ధి అంటే ఇదే అని మనమందరం నమ్ముతున్నాం కాబట్టి.

కాబట్టి చర్చ జరగాల్సింది మనకి కావాల్సిన అభివృద్ధి ఇదేనా? ఇదే అభివృధ్ధా? అనే విషయం గురించి. అంతేగానీ మా వైజాగ్ కొండలు బాగుండాలి కాబట్టి మాకు రాజధాని వద్దు అనడం హాస్యాస్పదం. విధ్వంసం అంతా విజయవాడోళ్లే భరించాలి, వాళ్ల పంటలే నాశనం అవ్వాలి, వాల్లరోడ్లే ట్రాఫిక్ భరించాలి, మేము మాత్రం సముద్రతీరం నుంచి వచ్చే పిల్లగాలులు పీల్చుకుని ఖుషీగా ఉంటాం అనడం అన్యాయం. అభివృద్ధి అనేది ఒక రక్తం మరిగిన రాక్షసి అయితే, దానికి మనందరం మనల్ని మనం
బలిచ్చుకోవాల్సిందే!

కాబట్టి ఏడవండి. కన్నీళ్లు కార్చండి. గుండెలు బాదుకోండి. కానీ మీ బాధని, ఆక్రోశాన్ని, కన్నీటిని, వేదనని కేవలం వైజాగ్ కే పరిమితం చేయకండి. మీ పరిధిని విస్తృతం చేసుకొని అభివృద్ధి పేరుతో ఎక్కడ విధ్వంసం జరిగినా నాలుగు కన్నీటి బొట్లు కార్చండి. నాలుగు పోస్టులు రాయండి.
జై అమరావతి! జై జై అమరావతి!!

Comments

Popular posts from this blog

What makes Arun Monditoka the most unique young politician of AP?

నువ్వు నమ్మినదానికోసం నిలబడడం అనే మరుగునపడిపోయిన కళ

Be like Jagan: జగన్ జీవితం నుంచి నేర్చుకోదగ్గ వ్యక్తిత్వ వికాస పాఠాలు